జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండల కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. కృత్తివెన్ను ప్రధాన కూడలిలోని కూనసాని కృష్ణ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేయడంతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు మార్గదర్శనం చేశారు.
కార్యకర్తలకు పూర్తి మనోధైర్యాన్ని కల్పిస్తూ గ్రామస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేయాలని ఉప్పాల రాము పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు విభేదాలు వీడి ఐక్యంగా పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
