జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట పెను సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. చట్టాన్ని రక్షించే పోలీసులమంటూ నాటకమాడిన సైబర్ కేటుగాళ్లు.. ఒక విశ్రాంత ఇంజనీర్‌ను తీవ్ర భయాందోళనలకు గురిచేసి ఏకంగా రూ.10 కోట్ల భారీ మొత్తాన్ని దోచుకున్నారు.
పోలీస్ అధికారుల పేరుతో బాధితుడికి ఫోన్ చేసిన దుండగులు, ఏదో తీవ్రమైన నేరంలో చిక్కుకున్నారని బెదిరిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో గంటల తరబడి ఆన్‌లైన్ నిఘాలో ఉంచారు. కేసుల నుంచి తప్పిస్తామని నమ్మబలికి ఆయనతో వివిధ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించారు. బాధితుడు కృష్ణలంకలోని కెనరా బ్యాంక్ శాఖలోని తన ఖాతా నుంచి నిందితులు సూచించిన రెండు బ్యాంకు ఖాతాల్లోకి దశలవారీగా రూ.10 కోట్లను డిపాజిట్ చేశారు. అయినప్పటికీ సైబర్ కేటుగాళ్లు ఇంకా అదనపు నగదు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు చివరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా వేగంగా దర్యాప్తు చేపట్టి, నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.7 కోట్లను సకాలంలో ఫ్రీజ్ చేయడంలో విజయం సాధించారు. కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశామని, డిజిటల్ అరెస్ట్‌ల పేరిట వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మి ఎవరూ డబ్బులు పంపవద్దని సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
