జన గళం క్రైమ్ డెస్క్: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రతకు భంగం కలిగిస్తున్న వారిపై తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలను ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడుతున్న వారికి న్యాయస్థానాలు సైతం కఠిన శిక్షలు ఖరారు చేస్తున్నాయి. తాజాగా గజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి తిరుపతి స్పెషల్ జేఎస్సీఎం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో వాహనం నడిపి పట్టుబడిన నిందితుడికి ఇరవై ఒక్క రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం రేణిగుంట మండలం పద్మానగర్‌కు చెందిన బుజ్జిపల్లి రామాంజనేయులు గజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని సోమవారం కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో, మోటార్ వెహికల్స్ యాక్ట్‌లోని సంబంధిత సెక్షన్ల కింద ఆయనను దోషిగా తేల్చారు. అక్టోబర్ ఐదవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఇది డ్రైవర్‌తో పాటు తోటి ప్రయాణికులు, అమాయక పాదచారుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వాహనదారులు ఎవరూ కూడా మద్యం తాగి డ్రైవింగ్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి రోడ్డు భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Slug: tirupati-drunk-and-drive-case-21-days-jail-gajulamandyam
