జనగళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: విజయవాడలో జరిగిన పెద్ది సినిమా వేడుకతో పాటు మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలకడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ పర్యటన సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించడంతో పాటు, ఆయనపై చూపిన ప్రత్యేక ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు ఎంపీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్నిని వ్యక్తిగతంగా కలిసి మెగా అభిమానుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సమావేశంలో అఖిల భారత చిరంజీవి యువత నాయకులు రవణం స్వామి నాయుడు మాట్లాడుతూ, తమ అభిమాన హీరో రామ్ చరణ్‌కు ఎంపీ కేశినేని చిన్ని అందించిన సహకారం ఎంతో సంతోషాన్నిచ్చిందని కొనియాడారు. కార్యక్రమాలు విజయవంతం కావడంలో ప్రజాప్రతినిధిగా వారు చూపిన చొరవ మరియు అభిమానులకు కల్పించిన సమన్వయ సహకారాలు అభినందనీయమని పేర్కొన్నారు. మెగా అభిమానులు ఆయా సమయాల్లో అందించిన మద్దతును గుర్తిస్తూ ఎంపీ చిన్ని తమను ప్రత్యేకంగా అభినందించడం పట్ల ధన్యులమని తెలిపారు.
కేశినేని చిన్ని స్పందిస్తూ మెగా అభిమానులు సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో చూపుతున్న చొరవను అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ, యువతను సన్మార్గంలో నడిపించడంలోనూ అభిమాన సంఘాల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు, అభిమానులు ఎంపీకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
Slug: vijayawada-mp-kesineni-chinni-thanked-by-mega-fans
