జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను పరుగులు పెట్టించే లక్ష్యంతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంబంధిత ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమీక్షకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ కుమార్, చీఫ్ ఇంజనీర్లు మరియు కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. రాజధాని పరిధిలో కొనసాగుతున్న వివిధ పనుల ప్రస్తుత పురోగతిపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా సాధారణ పరిపాలన శాఖ (GAD), విభాగాధిపతుల (HOD) ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులపై లోతైన చర్చ జరిగింది. ఐకానిక్ భవనాల ముఖభాగం (ఫెసాడ్) నిర్మాణ రూపకల్పనలో తీసుకోవాల్సిన భద్రతా, సాంకేతిక జాగ్రత్తలపై మంత్రి ఇంజనీరింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. అదేవిధంగా రాజధానిలో తుది దశకు చేరుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన సమయ పరిమితిలోగా రాజధాని ప్రాజెక్టులన్నీ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి కావాలని, ఎక్కడా జాప్యాన్ని సహించేది లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
