కోడూరు:
కోడూరు మండలం స్వతంత్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి దోమకాటు వ్యాధుల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామంలోని మురుగునీటి కాలువలు (డ్రైన్లు) పరిశీలించి, దోమల లార్వా ఉత్పత్తిని అరికట్టేందుకు ‘ఎబెట్’ (Abate) మందును పిచికారీ చేశారు. అలాగే ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉన్న పాత జాడీలు, నిరుపయోగ వస్తువులను గుర్తించి, వాటిలోని నీటిని, లార్వాను కిందకు ఒంపి తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు అప్పిగట్ల భారతమాస్తాన్ రావు, బోలెం వీరస్వామి, ఏఎన్ఎం సునీత మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
