జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ వేదికగా జాతీయ కాపు నాడు అధ్యక్షులుగా, సీనియర్ జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాలకు పైగా నిస్వార్థ సేవలందించిన ఉద్యమ నేత శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి దివంగత పార్థివ దేహానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆటోనగర్ ఉపాధ్యక్షులు శ్రీ నెరుసు కృష్ణ ఆంజనేయులు ఘనంగా నివాళులర్పించారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలతో పాటు సమాజంలోని బడుగు, బలహీన మరియు వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు తన జీవితాన్ని అంకితం చేశారని ఈ సందర్భంగా కొనియాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సామాజిక పోరాటాలకు నాయకత్వం వహిస్తూ, పేద విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడం, కాపునాడు పత్రిక ద్వారా అణగారిన వర్గాల గళాన్ని వినిపించడంలో సుబ్రహ్మణ్యం గారు పోషించిన పాత్ర చిరస్మరణీయమని నెరుసు పేర్కొన్నారు. ఆయన మరణం సామాజిక ఉద్యమ రంగానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం శోకసంద్రంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి జనసేన పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
