జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన పలువురు వ్యక్తులు తీవ్ర అనారోగ్య సమస్యలతో విజయవాడ నగరంలోని వివిధ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారు వారిని స్వయంగా పరామర్శించారు. గురువారం నగరంలోని ఆయా ఆసుపత్రులకు స్వయంగా వెళ్లిన ఆయన బాధితులను కలిసి, వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య చికిత్సల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాలకు సూచించారు.
ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని భరోసా కల్పించారు. చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చులతో పాటు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు వ్యక్తిగతంగా, అలాగే జనసేన పార్టీ తరఫున అందించి వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల క్షేమమే తమ ప్రాధాన్యతని, ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుంటామని స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో సామినేని ఉదయభాను వెంట జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
