జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో యావత్ యువతలో విప్లవ స్ఫూర్తిని రగిల్చిన మహోన్నత అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ గారి 120వ జయంతి వేడుకలను రాజంపేటలో ఘనంగా నిర్వహించనున్నారు. రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ యల్లటూరు శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో నేడు (సెప్టెంబర్ 28) ఉదయం 10:30 గంటలకు స్థానిక యల్లటూరు భవన్లో ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటైంది.
మాతృభూమి దాస్య శృంఖలాలను తెంచేందుకు ఉరికొయ్యలను సైతం చిరునవ్వుతో ముద్దాడిన భగత్ సింగ్ త్యాగం భావితరాలకు నిరంతరం స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. ఆయన చూపిన దేశభక్తి, అంకితభావం ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించే నివాళి కార్యక్రమంలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ మహనీయుని సేవలను స్మరించుకోనున్నారు. ఈ దేశభక్తి పూర్వక కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, విద్యార్థులు, యువత మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని యల్లటూరు శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు.
