జన గళం క్రైమ్ డెస్క్: ఆధునిక సాంకేతికతతో నూరు శాతం పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీరుగారిపోతున్నాయి. బతికున్న వ్యక్తినే చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా రూ. 5 కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు పన్నిన భారీ కుట్రను కృష్ణా జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.
గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. కానూరు పరిధిలో బిక్కిన సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన 822 గజాల ఖరీదైన స్థలం ఉంది. ఆ స్థలాన్ని విక్రయానికి పెట్టగా, యజమాని వద్ద నుంచి సేకరించిన జిరాక్స్ పత్రాలతో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన ఒక ఉద్యోగి, రియల్ ఎస్టేట్ ముఠా కలిసి స్కెచ్ వేశారు. అసలు యజమానులు బిక్కిన మారయ్య, రాజేశ్వరిలు గొల్లపూడిలో మరణించినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు, రావిళ్ళ రాజేశ్వరిని ఏకైక వారసురాలిగా చూపిస్తూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించారు. అనంతరం మందాడి ఆదిరెడ్డిని జనరల్ పవర్ ఏజెంట్‌గా చూపిస్తూ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జనవరి 30న (దస్తావేజు నం. 1623/2026) అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించారు. నిబంధనల ప్రకారం డెత్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పరిశీలించాల్సి ఉన్నప్పటికీ, రిటైర్డ్ అధికారి పలుకుబడితో నిబంధనలను తుంగలో తొక్కి ప్రక్రియ ముగించారు. ఆ వెంటనే ఫిబ్రవరి 13న ముసునూరి సౌజన్య పేరుతో (దస్తావేజు నం. 2493/2026) సేల్ డీడ్ పూర్తి చేసి రూ. 5 కోట్లకు అమ్మకానికి పెట్టారు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అసలు యజమాని బిక్కిన సుబ్బారావు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కుట్రలో భాగస్వాములైన మైనంపాటి వెంకటరమణ, మణికుమార్, ఉప్పలపాటి సాంబశివరావు, మందాడి ఆదిరెడ్డి, శివాంజనేయులు, కాసాని అమలేశ్వరరావులను అరెస్టు చేశారు. పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నత అధికారికి లక్షల రూపాయలు ముట్టజెప్పి ఈ అక్రమాలు సాగించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. సొంత శాఖలోనే ఇంటి దొంగలుగా మారిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
