జన గళం శ్రీకాకుళం డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలకు ఒడిగడుతున్నారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ పేరాడ తిలక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టెక్కలి పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉపాధి హామీ సమావేశం ఉందని నమ్మబలికి సీతాపురం గ్రామానికి చెందిన మహిళలను నిమ్మాడకు తీసుకెళ్లి బలవంతంగా పచ్చ కండువాలు కప్పారని పేరాడ తిలక్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సదరు గ్రామానికి చెందిన మహిళలు, పెద్దలు స్వయంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి విచ్చేసి మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని, తమను మోసపూరితంగా అక్కడికి తీసుకువెళ్లారని మహిళలు స్పష్టం చేశారు. సీతాపురంలో ఉన్న ఇళ్లే పరిమితమైతే, టీడీపీలోకి 500 కుటుంబాలు చేరాయంటూ అచ్చెన్నాయుడు ఎలా అబద్ధాలు చెబుతారని తిలక్ సూటిగా ప్రశ్నించారు. ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, పింఛన్ల పేరుతో ఓటర్లను భయపెడుతూ టీడీపీ కార్యకర్తలు లబ్ధిదారులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి, వైఎస్సార్‌సీపీ నేతలు సత్తారు సత్యం, తమన్న గారి కిరణ్, కిల్లి అజయ్ కుమార్, బెండి ఉదయ్, కర్ణిక జీవన్ రావు, బర్ల కార్తీక్, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
