జన గళం నెల్లూరు డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు అపూర్వమైన, వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి పర్యటనకు విచ్చేసిన డిప్యూటీ సీఎంకు స్థానిక ప్రజానీకం, పార్టీ శ్రేణులు నీరాజనాలు పట్టారు.
పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ సమీపంలోని మైదానంలో వందలాది గొడుగులను క్రమపద్ధతిలో పేర్చి, ఏరియల్ వ్యూలో స్పష్టంగా కనిపించేలా “WELCOME TO UDAYAGIRI PAWAN KALYAN SIR” అనే అక్షరాల రూపంలో వినూత్నంగా తీర్చిదిద్దారు. డ్రోన్ కెమెరా ద్వారా చూసినప్పుడు ఆకర్షణీయంగా కనిపించిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పల్లెల ప్రగతికి సరికొత్త బాటలు వేస్తున్న తమ ప్రియతమ నేత రాకతో ఉదయగిరి ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొందని, ప్రజలు, యువత, మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి జనసేనానికి హృదయపూర్వక స్వాగతం పలికారని స్థానిక నాయకులు తెలిపారు.
