జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పేదల చిరకాల స్వప్నం సాకారమయ్యే చారిత్రాత్మక తరుణం ఆసన్నమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని సింగ్ నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో బుధవారం నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పేదలకు పట్టాభిషేకం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నియోజకవర్గ పరిధిలోని 24,057 పేద కుటుంబాలకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను అందజేయనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ మరియు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు నేడు స్వయంగా స్టేడియాన్ని సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ చట్టబద్ధమైన హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత భూహక్కులు కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ద్వారా పేదలకు తమ ఆస్తిపై పూర్తి స్థాయి చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయని తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, అత్యవసర వైద్య చికిత్సలు వంటి కుటుంబ అవసరాల నిమిత్తం ఈ ఆస్తిని ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని, అవసరమైతే జాతీయ బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందేందుకు కూడా ఈ హక్కులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
పేదల ఇళ్లకు శాశ్వత భూహక్కులు కల్పించాలనే డిమాండ్‌ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక దృష్టికి తీసుకెళ్లి, అసెంబ్లీ వేదికగా కూడా బలంగా ప్రస్తావించి పేదల తరఫున తాను జీవో ముప్ై ద్వారా నిరంతరం కృషి చేసినట్లు బొండా ఉమా గారు గుర్తుచేశారు. ఈ పట్టాల పంపిణీ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, తరతరాలుగా పేదరికం అనుభవిస్తున్న వర్గాల పిల్లల భవిష్యత్తుకు భరోసానిచ్చే మహోన్నత ఆస్తి హక్కు అని ఆయన అభివర్ణించారు. తమ జీవితకాల స్వప్నం నెరవేరుతుండటంతో లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
slug: vijayawada-pedalaku-pattabhishekam-program-by-cm-chandrababu
