రచన: TVR విఠల్, జన గళం రాజంపేట డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జనసేన పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా నియమితులైన రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ రాజంపేటకు విచ్చేశారు.
రాజంపేటలోని యల్లటూరు భవనంలో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు ఆయనకు సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇరువురు నేతలు స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కూటమి శ్రేణుల సమన్వయంపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జనసేన పార్టీ బలాన్ని చాటేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని, పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం కోసం సమన్వయంతో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
