రచన: మహమ్మద్ రఫీ, జన గళం అన్నమయ్య జిల్లా డెస్క్: మతసామరస్యానికి, ప్రజల మధ్య సోదరభావానికి ఉరుసు మహోత్సవాలు నిలువెత్తు ప్రతీకలని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ యల్లటూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రసిద్ధ జండామాను ఉరుసు మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉరుసు మహోత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాకుండా, కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసి ప్రేమ, పరస్పర గౌరవాన్ని పెంపొందించే అద్భుత వేదికలని కొనియాడారు. అన్ని మతాల ప్రజలు ఐకమత్యంతో మెలిగినప్పుడే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లుతాయని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు, ప్రముఖులు సయ్యద్ జుల్ఫికర్, సయ్యద్ అమీర్, ఉరుసు కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
