రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్
- విఘ్నాలు తొలగి రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలని ఆకాంక్ష
- పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: పిడుగు హరిప్రసాద్ పిలుపు
అమరావతి:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రభుత్వ విప్, జనసేన పార్టీ ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ రాష్ట్ర ప్రజలకు, జనసేన-కూటమి శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు తలపెట్టే ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి వైపు నడిపిస్తోందని, గణనాథుని కృపతో ప్రజా సంక్షేమం మరింత విస్తృతం కావాలని ప్రార్థించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ప్రశాంతత నిండాలని కోరుకున్నారు.
ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులుగా పర్యావరణహిత మట్టి వినాయకులనే పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, పవిత్ర భావనతో, ఆనందోత్సాహాల నడుమ శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
