జన గళం :ఆంధ్రప్రదేశ్ డెస్క్: త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సంపూర్ణ ఆధిక్యమే లక్ష్యంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి నాయకులు సమరశంఖం పూరించారు. స్థానిక సంస్థల సమరానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా శ్రీకాకుళంలో కూటమి ముఖ్య నేతల సమన్వయ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కీలక సమావేశానికి టీడీపీ నేత మహమ్మద్ నజీర్, జనసేన నేత లోకం నాగ మాధవి, బీజేపీ నేత నడికుదిటి ఈశ్వరరావు సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాబోయే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలు, ఓటర్లను ఆకట్టుకునేందుకు చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణపై నేతలు సమగ్రంగా చర్చించారు.
మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పటిష్టమైన సమన్వయం ఉండాలని నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలవాలని నిర్ణయించారు. ఎక్కడా సమన్వయ లోపం తలెత్తకుండా బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించేలా ఉమ్మడి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేయడమే పరమావధిగా అంతా ఒక్కతాటిపై నడవాలని పిలుపునిచ్చారు.
ఈ సమన్వయ సమావేశంలో టీడీపీ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, జనసేన సమన్వయకర్తలు పేడాడ రామ్మోహన్ రావు, గేదెల చైతన్య, బీజేపీ సమన్వయకర్త పైడి వేణుగోపాలం, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురపు తేజేశ్వరరావుతో పాటు కూటమి ముఖ్య నేతలు, నియోజకవర్గ స్థాయి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు పార్టీల శ్రేణులు పరస్పర సహకారంతో ఎన్నికల బరిలోకి దిగితే అఖండ విజయం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉమ్మడి ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
