జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడు డిపో నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఇంద్ర బస్సు విస్సన్నపేట వద్ద సాంకేతిక లోపంతో మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. సుమారు నలభై నిమిషాలకు పైగా బస్సు అక్కడే నిలిచిపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రాత్రి వేళ నడిరోడ్డుపై బస్సు మొరాయించడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సుదూర ప్రాంతాలకు నడిపే బస్సుల పరిస్థితిని ముందస్తుగా డిపోల్లో క్షుణ్ణంగా తనిఖీ చేయకుండానే రోడ్లపైకి తీసుకొస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మార్గంలో తరచూ ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
