జన గళం కన్స్యూమర్ డెస్క్: వాతావరణంలో వచ్చే ఎల్-నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షాలు తగ్గుతాయో లేదో తెలీదు కానీ, మార్కెట్‌లో మాత్రం నిత్యావసర సరుకుల ధరలు అప్పుడే ఆకాశాన్నంటుతుండటంపై సామాన్య ప్రజలు, వినియోగదారుల సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బియ్యం నుంచి నూనెలు, పప్పులు, కూరగాయల వరకు ధరలను అమాంతం పెంచేయడానికి ‘ఎల్-నినో’ను అడ్డుపెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రజలు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో నిజంగా సరుకుల కొరత ఉందా, లేక రాబోయే రోజుల్లో కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో కొందరు బడా వ్యాపారులు ముందస్తుగానే సరుకులను అక్రమంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారా అనే వాస్తవాలను తేల్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.
రోజూ రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుడికి కిలో బియ్యంపై రూ. 10 పెరిగినా కుటుంబ బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతుందని, అందుకే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తక్షణమే మార్కెట్ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గోదాముల్లో నిల్వలు ఎంత ఉన్నాయి? మార్కెట్‌కు వస్తున్న సరుకు పరిమాణం ఎంత? ఎవరు అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు? అనే విషయాలపై కేవలం అధికారిక సమావేశాలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేస్తున్నారు. ఎల్-నినో ప్రకృతి సమస్య కావొచ్చు కానీ, దాని పేరు చెప్పి సామాన్యుడి జేబులు ఖాళీ చేయడం ముమ్మాటికీ బహిరంగ దోపిడీయేనని, అక్రమార్కులపై కఠినంగా కేసులు నమోదు చేసి, సబ్సిడీ కౌంటర్ల ద్వారా నిత్యావసరాలను తక్కువ ధరకే అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
By :మనోహర్ తోట
