రచన: జన గళం స్పెషల్ డెస్క్, కృత్తివెన్ను/పెడన: కోస్తా తీర ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన, ఎన్నో ప్రజా ఉద్యమాల ఫలితంగా రూపుదిద్దుకున్న 216 జాతీయ రహదారి నేడు నెత్తుటి కూడలిగా మారుతోంది. ఒంగోలు నుండి మచిలీపట్నం, నర్సాపురం, అమలాపురం, కాకినాడ, తుని మీదుగా కలకత్తా జాతీయ రహదారిని కలిపే ఈ ప్రధాన రహదారిపై పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చిన నాటి నుంచి భారీ వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే పేరుకే జాతీయ రహదారైనా, ఇది సింగిల్ లైన్ (టూ-లేన్) తరహాలోనే ఉండటం, దానికితోడు ఎన్‌హెచ్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో తరచూ ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ‘తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్లుగా సంబంధిత అధికారులు చేతులెత్తేయడంపై ప్రజలు, ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ముఖ్యంగా పెడన నియోజకవర్గ పరిధిలోని నందమూరు, బల్లిపర్రు, కృత్తివెన్ను, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఈ రహదారి గ్రామాల మధ్య నుంచే వెళ్తోంది. ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న మార్జిన్లను పూర్తిస్థాయిలో ఆక్రమించి కార్యకలాపాలు సాగిస్తున్నారు. గత శనివారం లక్ష్మీపురంలో జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. పాత ఇనుప సామాను వ్యాపారి రోడ్డు మార్జిన్ మొత్తం తన బస్తాలతో నింపేయడంతో, లోడింగ్ కోసం లారీని రోడ్డుపైనే నిలిపారు. రోడ్డుపై ఆగిన లారీని బైకర్ వెనుక నుంచి ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. కొందరు వ్యాపారులు రోడ్డుపైకి వేలాడదీసే తీవ్రమైన ఎల్ఈడీ (LED) లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లను బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. అటు ఎన్‌హెచ్ పెట్రోలింగ్ లేకపోవడం, ఇటు స్థానిక పోలీసులు ఇతర బందోబస్తుల పని ఒత్తిడిలో ఉండటంతో ఆక్రమణదారులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికైనా ఎన్హెచ్ఏఐ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మార్జిన్ల ఆక్రమణలను తొలగించాలని, హెచ్చరిక బోర్డులు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, దీర్ఘకాలిక పరిష్కారంగా ఈ రహదారిని 4-లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా విస్తరించాలని తీరప్రాంత ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
