జన గళం మచిలీపట్నం/గుంటూరు బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని మరింత పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీకి అత్యంత బలమైన ఓటుబ్యాంకు, విస్తృత ప్రజాదరణ ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ అడ్‌హాక్ కమిటీలు పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాయి.
క్షేత్రస్థాయిలో పార్టీ బలం, బూత్ స్థాయి స్థితిగతులు, గెలుపు అవకాశాలున్న అభ్యర్థుల వివరాలను సేకరించే బాధ్యతను ఈ కమిటీలకు అప్పగించారు. ప్రతి పార్లమెంట్ కమిటీలో ముగ్గురు కీలక నేతలు, అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు నాయకులు మరియు వారికి సహాయంగా ‘నిర్వాహక్ దళ్’ సమన్వయం చేసుకోనున్నాయి. కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, బీజేపీలతో సఖ్యత కొనసాగిస్తూనే, స్థానిక సంస్థల సమరంలో జనసేన సత్తా చాటడమే లక్ష్యంగా గ్రౌండ్‌వర్క్ చేపట్టారు. ఈ కమిటీలు అందించే సమగ్ర నివేదికల ఆధారంగా త్వరలోనే పవన్ కళ్యాణ్ పార్లమెంట్ వారీగా సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు.
