జన గళం ప్రత్యేక ఫీచర్స్ డెస్క్: బయటకు కనిపించే హుందాతనం, ఆకర్షణీయమైన జీతం, సొంత ఇంటి వెనుక ఉన్న అసలు ఆర్థిక వాస్తవాలు ఆ ఇంటిని నడిపే గృహస్థులకే తెలుస్తాయి. ముఖ్యంగా 35 నుంచి 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం కుటుంబ భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. ఉద్యోగం మారాలన్నా పిల్లల చదువులు, విశ్రాంతి తీసుకుందామన్నా నెలాఖరున ముంచుకొచ్చే ఈఎంఐలు మధ్యతరగతి జీవిని వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని ఆర్థిక ఆటుపోట్లు ఎదురైతే కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. అందుకే రాబోయే ఆరు నెలల పాటు అనవసర ఖర్చులు, అప్పులు, భారీ ఈఎంఐల జోలికి వెళ్లకుండా పక్కా ప్రణాళికతో ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లను దాచుకోకుండా కుటుంబ సభ్యులతో పంచుకుంటూ, ఖర్చులను సర్దుబాటు చేసుకుంటూ, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడమే సంక్షోభాల నుంచి గట్టెక్కించే మార్గమని స్పష్టం చేస్తున్నారు.
by. మనోహర్ తోట.
