జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ సాంస్కృతిక వైభవానికి, చారిత్రక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రతిష్టాత్మక విజయవాడ ఉత్సవ్ 2.0 మరియు సరస్ మేళా వేడుకలు ఆదివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. నగరంలోని కృష్ణమ్మ ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్ వేదికగా ఈ వేడుకలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం మరియు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్‌ల మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ నగరానికి వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఈ సాంస్కృతిక సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు రాష్ట్రంత్ర మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు నిర్వాహకులు, కూటమి నాయకులు సర్వం సిద్ధం చేశారు. అక్టోబర్ 11వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పున్నమి ఘాట్ వేదికగా ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు మరియు వివిధ రాష్ట్రాల ప్రత్యేక రుచులతో ఈ ప్రాంగణం కళకళలాడనుంది.
నగర సంస్కృతిని, దేశీయ హస్తకళలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ ఉత్సవానికి ప్రజలందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. దసరా పండుగ శోభను మరింత ఇనుమడింపజేసే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద ప్రదర్శనలు, ఫుడ్ ఫెస్టివల్స్ మరియు ప్రదర్శన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవాడను ఒక ప్రముఖ సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
Slug: vijayawada-utsav-2-and-saras-mela-grand-launch-punnami-ghat
