జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి దేవస్థాన యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉత్సవాల తొలి మూడు రోజులకు సంబంధించిన వీఐపీ దర్శన టికెట్లను ఆలయ ఈవో శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు. అమ్మవారి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పారదర్శక విధానంలో దర్శనాలు కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా భక్తులు ‘మన మిత్ర’ మొబైల్ యాప్ ద్వారా రూ. 1,000 విలువైన ప్రత్యేక దర్శన టికెట్లను పొంది బంగారు వాకిలి గుండా అమ్మవారిని దర్శించుకోవచ్చని ఈవో స్పష్టం చేశారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన మూలా నక్షత్రం రోజు మినహా, మిగతా అన్ని రోజులకు సంబంధించిన టికెట్లను విడతల వారీగా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో టికెట్ పొందిన వారు ప్రయాణించేందుకు వీలుగా టీటీడీ స్థలం నుంచి దేవాదాయ శాఖ ప్రత్యేక బస్సుల ద్వారా కొండపైకి చేరవేసే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
దసరా ఉత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, అన్నప్రసాద వితరణ, లడ్డూ ప్రసాదాల విక్రయం వంటి అన్ని విభాగాల్లోనూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, అధికారులకు సహకరించి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.
Slug: vijayawada-indrakeeladri-dasara-utsavalu-vip-tickets-mana-mitra-app
