జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై, ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండియా కూటమి పిలుపు మేరకు విజయవాడలో ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తీరుకు నిరసన తెలుపుతున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాసేలా పోలీసులు వ్యవహరించడం దారుణమని ఆక్షేపించారు.
ఈ సందర్భంగా తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డు ప్రకాశరావు, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి లక్ష్మీదాస్, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు గంజా కృష్ణమోహన్, రైతు సంఘం నాయకులు గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థను పూర్తిగా బీజేపీకి తాకట్టుపెట్టి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల కనుసన్నల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థల అధిపతులు అధికార పార్టీకి ఊడిగం చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వెంటనే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, స్వాతంత్ర్య విలువలను బీజేపీ ప్రభుత్వం క్రమంగా మంటగలుపుతోందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నాటి అణచివేత విధానాలను తలపించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఉందని విమర్శించారు. ప్రజలందరూ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిశితంగా గమనిస్తున్నారని, కాలం చెల్లిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Slug: tiruvuru-congress-press-meet-condemns-sharmila-arrest
