జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందడంలో పేద కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అర్హులైన బాధితులకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలు, కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన 146 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 80,38,855 విలువైన వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ చెక్కులు తాజాగా మంజూరయ్యాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ లబ్ధిదారులకు ఈ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సందేశ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పలు మండలాల లబ్ధిదారులకు నేరుగా చెక్కులు పంపిణీ చేశారు. మండలాల వారీగా మంజూరైన సహాయం వివరాలను పరిశీలిస్తే:
- జి.కొండూరు మండలంలో 31 మందికి రూ. 18,70,622
- విజయవాడ రూరల్ మండలంలో 22 మందికి రూ. 11,96,390
- కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 13 మందికి రూ. 6,03,199
- ఇబ్రహీంపట్నం మండలంలో 10 మందికి రూ. 4,49,464 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
ఇవి కాకుండా మైలవరం మండలంలోని 40 మందికి, రెడ్డిగూడెం మండలంలోని 29 మందికి కూడా సీఎంఆర్ఎఫ్ రీయింబర్స్‌మెంట్ చెక్కులు మంజూరయ్యాయని, త్వరలోనే వారికి కూడా నేరుగా అందజేస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం అప్పులపాలై ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. తమకు ఆపద సమయంలో అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, అలాగే ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Slug: mylavaram-cmrf-checks-distribution-mla-vasantha-krishna-prasad
