జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. తిరువూరులోని తన కార్యాలయంలో నిర్వహించిన బీసీల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 40 శాతం సీట్లు కేటాయించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభాలో సుమారు 50 శాతం ఉన్న బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన సముచిత రాజకీయ భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కీలక డిమాండ్‌ను తిరువూరు గడ్డపై నుంచే ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నానికి ఎదురైన అడ్డంకుల గురించి ఎమ్మెల్యే ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కొందరు కోర్టును ఆశ్రయించడం వల్ల ఆశించిన విధంగా తీర్పు రాలేదని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు ఎప్పుడూ అండగా నిలుస్తారని తెలిపారు. పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం సీట్లు కేటాయించి సంపూర్ణ న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, అవకాశం ఉన్న చోట అదనంగా కూడా సీట్లు కేటాయించేందుకు కృషి చేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటివరకు తగిన ప్రాతినిధ్యం నోచుకోని రజక, వడ్డెర కులాలకు రానున్న ఎన్నికల్లో సముచిత అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. బీసీ వర్గాల్లోని అన్ని ఉప కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని బీసీలకు న్యాయం చేసే దిశగా ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో స్థానిక కూటమి నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Slug: tiruvuru-mla-kolikapudi-srinivas-rao-bc-40-percent-seats-call
