జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత కీలక దశకు చేరుకుంది. స్థానిక శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారి ఆదేశానుసారం కృత్తివెన్ను మండలంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులకు అధికారిక ‘బి-ఫామ్’లను కూటమి ముఖ్య నాయకులు నేడు లాంఛనంగా అందజేశారు.
ఈ సందర్భంగా బీ-ఫామ్లు అందుకున్న అభ్యర్థులు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి, ప్రజల సంక్షేమం, మండల సమగ్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని, ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి కూటమి సత్తా చాటుతామని నాయకుల సమక్షంలో ఏకగ్రీవంగా ప్రతిజ్ఞ చేశారు. కూటమిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయంతో కదులుతూ ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను చేరవేసి అభ్యర్థులందరినీ భారీ ఆధిక్యంతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను మండల కూటమి ముఖ్య ప్రజాప్రతినిధులు, పార్టీల మండల అధ్యక్షులు, సమన్వయకర్తలు, కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల సమరంలో కూటమి ఐక్యతను చాటారు.
