చారిత్రక నేపథ్యం కలిగిన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెడుతోంది. సమర్థులైన మేయర్ అభ్యర్థుల ఎంపిక కోసం పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా రహస్యంగా బయోడేటాలను సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జనసేన తరఫున ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ పేరు తెరపైకి రాగా, ఆయన సేవా కార్యక్రమాలు, రాజకీయ అనుభవాన్ని అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. టీడీపీ తరఫున మాజీ కౌన్సిలర్ మరకాని సమత కీర్తి, బీజేపీ తరఫున పంతం గజేంద్ర పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని రాజకీయ చతురతను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రజల్లో బలమైన పట్టున్న నాయకుడిని బరిలోకి దించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కూటమిలో సమన్వయ లోపం, ఎంపీ వర్గానికి, మంత్రి వర్గానికి మధ్య పెరుగుతున్న అంతరం, బీజేపీకి తగిన ప్రాధాన్యత దక్కకపోవడం వంటి అంశాలు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి. కార్పొరేటర్ స్థానాల సర్దుబాటు ఒక కొలిక్కి రాకపోవడం, అసమ్మతి స్వరాలు పెరగడం పట్ల అప్రమత్తం కాకపోతే అంతిమంగా వైసీపీకే లబ్ధి చేకూరే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
