విజయవాడ, 2026 సెప్టెంబర్ 16, (జనగళం ప్రత్యేక ప్రతినిధి):
సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారిన జనసేన పార్టీ ముందు ఇప్పుడు అసలైన సవాలు నిలిచింది. అసెంబ్లీ సంబరాలు ముగిసి త్వరలోనే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న వేళ.. గ్రామీణ, వార్డు స్థాయిలో పార్టీకి వెన్నెముకగా నిలిచిన జనసైనికులు, వీరమహిళలకు టికెట్ల కేటాయింపులో న్యాయం జరుగుతుందా లేదా అన్న అంశం క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాలు ఇలా ఉన్నాయి, దశాబ్ద కాలం పాటు సొంత జేబుల నుంచి నిధులు వెచ్చించి, గత ప్రభుత్వాల అక్రమ కేసులు, వేధింపులు భరించి ‘పవన్ కళ్యాణ్ మా నాయకుడు’ అంటూ పార్టీ ఉనికిని కాపాడిన పాత కార్యకర్తల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఏర్పడగానే వివిధ పార్టీల నుంచి వచ్చి చేరుతున్న వలస నాయకులు, ఆర్థికంగా బలవంతులైన వారే నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతూ స్థానిక సంస్థల సీట్లను కొల్లగొడతారనే భయం పాత క్యాడర్‌ను తీవ్ర నైరాశ్యంలోకి నెడుతోంది. గత స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థుల బెదిరింపులను తట్టుకుని ప్రాణాలకు తెగించి నామినేషన్లు వేసి, ఓడిపోయినా పార్టీ జెండాను వదలకుండా కాపాడిన నాయకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేడర్ ముక్తకంఠంతో కోరుతోంది.
ఈ సందిగ్ధతను తొలగించేలా ఇటీవల ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర్ బృందం చేపట్టిన సరికొత్త కార్యాచరణ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎలాంటి సిఫార్సుల లేఖలను నమ్మకుండా నేరుగా క్రింది స్థాయి కార్యకర్తలు, ఆశావహులతో ముఖాముఖి మాట్లాడటం, పక్కా క్షేత్రస్థాయి సర్వేలతో గెలుపు అవకాశాలను అంచనా వేయడం, టీడీపీ–బీజేపీతో కూటమి సమన్వయ సమావేశాల్లో జనసేన బలాన్ని నిరూపించి సీట్లను సాధించే ‘ఒంగోలు–నెల్లూరు మోడల్’ను రాష్ట్రమంతటా అమలు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలే ఏ పార్టీకైనా సంస్థాగత పునాదులు. అసెంబ్లీలో లభించిన చారిత్రక విజయం గ్రామసీమల్లో శాశ్వత రాజకీయ శక్తిగా రూపాంతరం చెందాలంటే నిబద్ధత కలిగిన కార్యకర్త ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిందే. ధనబలం లేదన్న నెపంతో పార్టీ పునాదులను మోసిన వారిని పక్కన పెట్టకుండా, నియోజకవర్గాల్లో స్థానిక సమన్వయకర్తలు లేదా ఎమ్మెల్యేల ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా పారదర్శకమైన ఎంపిక మార్గదర్శకాలను తక్షణమే విడుదల చేయడమే జనసేన అధినాయకత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం.
స్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణ
