తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని దివంగత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయులు ముద్రగడ బాలు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముద్రగడ గిరిబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల కన్నుమూసిన సమయంలో వైఎస్ జగన్ స్వయంగా అంతిమయాత్రకు విచ్చేసి, పాడే మోసి తమ కుటుంబానికి పెద్ద కొడుకులా నిలిచిన తీరుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ కష్టకాలంలో ఇచ్చిన ధైర్యం, చూపిన ఆప్యాయతను తమ కుటుంబం ఎన్నటికీ మరచిపోలేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం గారు తన రాజకీయ జీవితంలో ప్రదర్శించిన నిబద్ధత, విశ్వసనీయతలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డబ్బు, ఆరోగ్యం పోతే తిరిగి పొందవచ్చని, కానీ విశ్వసనీయత, మంచి పేరును కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టేనని స్పష్టం చేస్తూ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని మార్గదర్శనం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తానని గిరిబాబు ఈ సందర్భంగా పార్టీ అధినేతకు హామీ ఇచ్చారు.
