కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని నీలిపూడి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ అవగాహన సదస్సు జరిగింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంటల సాగు విధానాలు, సకాలంలో పంట నమోదు (ఈ-పంట), ఈ-కేవైసీ ప్రక్రియల ఆవశ్యకతపై రైతులకు అధికారులు సమగ్ర అవగాహన కల్పించారు.
రైతులందరూ ఈ నెలాఖరులోగా ఈ-పంట నమోదుతో పాటు ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి (ఏవో) పి.ఎం. కిరణ్ స్పష్టం చేశారు. దీని ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పంట నష్టపరిహారం, బీమా వంటి ప్రయోజనాలు నేరుగా అందుతాయని తెలిపారు. పంటల సాగులో సందేహాలుంటే వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి శాస్త్రీయ పద్ధతులు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీఏఏ ప్రశాంతి, స్థానిక రైతులు పాల్గొన్నారు.
