ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాల సరసన అత్యంత గర్వదాయకమైన స్థాయికి చేరుకుందని అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారి నాగపుట్టలో పాలు పోసి, గర్భాలయంలో ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంతర్జాతీయంగా ఎన్నో దేశాల్లో రాజకీయ, ఆర్థిక అస్థిరతలు నెలకొన్నప్పటికీ, మోడీ దార్శనికతతో కూడిన పాలన వల్ల భారత్ శరవేగంగా ప్రగతి సాధిస్తోందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అభివృద్ధి నిధులు అందుతున్నాయని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చొరవ, బీజేపీ ఆమోదంతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సుపరిపాలన దిశగా సాగుతోందని వెల్లడిస్తూ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
