రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజే (DJ) వాహనాలకు పోలీసులు ఆంక్షలు విధించకుండా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. నిమజ్జనాల్లో డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని, వాహనాలను అడ్డుకుంటున్నారని తనకు పెద్దఎత్తున సందేశాలు వస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ అంశంపై హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర డీజీపీ తక్షణమే జోక్యం చేసుకోవాలని లోకేష్ కోరారు. ఉత్సవ కమిటీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని, పోలీసులు ఒక్క డీజే వాహనాన్ని కూడా సీజ్ చేయకూడదని పోలీసు శాఖకు సూచించారు. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పండుగ వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
