హైదరాబాద్, 2026 సెప్టెంబర్ 20, (జనగళం డెస్క్):
రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రజాహిత సేవా కార్యక్రమాలతో సమాజ సేవలో నిరంతరం ముందుండే మెగా కుటుంబ అభిమాన సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ నగరంలో కొలువుదీరారు. మెగాఫోర్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ప్రత్యేక సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, ప్రముఖ సినీ నిర్మాత, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితురాలు శ్రీమతి సుస్మిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మెగా అభిమాన సంఘాల కీలక బాధ్యులు, ముఖ్య ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వివరాలు ఇలా ఉన్నాయి, ప్రతి ఏటా మార్చి 27న గ్లోబల్ స్టార్ రామ్చరణ్, ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి, సెప్టెంబర్ 2న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అభిమానుల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ సేవా కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించారు. గ్రామ, పట్టణ స్థాయిల్లో వేలాది యూనిట్ల రక్తదాన శిబిరాలు, నిరుపేదలకు అన్నదాన వితరణ, ఉచిత మెగా వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన ఉత్తమ అభిమాన సంఘాల నాయకులు, కార్యకర్తలను గుర్తించి సుస్మిత చేతుల మీదుగా ప్రత్యేకంగా సత్కరించారు. భవిష్యత్తులో రక్తదాన ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆసక్తికర చర్చ – ? తెరపైకి అభ్యర్థిత్వాల అంశం:
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు (కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు) మెగా అభిమానుల సమావేశంలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, స్థానిక ప్రజలతో నిరంతరం మమేకమై పట్టు సాధించిన సీనియర్ అభిమానుల్లో కొందరు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అఖిల భారత చిరంజీవి యువత ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ రావణం స్వామి నాయుడు సమక్షంలో అభిమానుల ఆకాంక్షలు, సంబంధిత డివిజన్లు/వార్డుల్లో నెలకొన్న క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలు, ప్రజాసేవా రికార్డు తదితర అంశాలపై ప్రాథమిక చర్చకు ఆస్కారం ఉన్నట్లు సీనియర్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఎన్నికల బరిపై ఎటువంటి అధికారిక ప్రకటనగానీ, అభ్యర్థుల ఖరారుగానీ జరగలేదని, ప్రస్తుతం ఇది కేవలం అభిమాన వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ మాత్రమేనని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఏపీ మున్సిపల్ పోరు ముంచుకొస్తున్న తరుణంలో మెగా అభిమానుల వర్గాల్లోనూ ఎన్నికల సెగ తాకడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.
Slug: print-hyderabad-mega-fans-conference-sushmitha-konidela-chief-guest-charity-and-ap-local-body-elections
