జన గళం ప్రత్యేక ప్రతినిధి: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కేవలం ఓటు మాత్రమే కాదని, అది సామాన్య పౌరుడి గొంతుక అని, అలాంటి హక్కును కాలరాసే విధంగా ఓటర్ల తొలగింపు ప్రక్రియ సాగకూడదని పౌర హక్కుల వేదిక తీవ్రంగా హెచ్చరించింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర సమాచార సమీక్ష (ఎస్ఐఆర్) పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 46.62 లక్షల పేర్ల తొలగింపు, పునఃపరిశీలన జరుగుతున్న తీరుపై విలేకరుల సమావేశంలో ఘాటు ప్రశ్నలు సంధించారు. చనిపోయిన వారివి, నకిలీ పేర్ల ఏరివేతను ఎవరూ వ్యతిరేకించడం లేదని, కానీ పొరపాటున కూడా ఏ ఒక్క అర్హత కలిగిన భారత పౌరుడి ఓటు రద్దు కాకూడదని డిమాండ్ చేశారు. ఉపాధి కోసం ఇతర నగరాలకు వెళ్లిన కార్మికులు, ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు, తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాలు తనిఖీల సమయంలో ఇంట్లో లేనంత మాత్రాన వారి పేర్లను ఎలా తొలగిస్తారని నిలదీశారు. ఇళ్లకు తాళాలు పడితే పౌరుల హక్కులకు తాళం వేస్తారా అని ప్రశ్నిస్తూ, ఒకవేళ పొరపాటున అర్హుడైన పౌరుడి ఓటు తొలగిస్తే ఆ బాధ్యత ఎవరిదో ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తొలగింపులకు గల కారణాలను ముందస్తుగా తెలియజేయాలని, అభ్యంతరాల నమోదుకు తగిన సమయం ఇవ్వాలని, పునఃపరిశీలన ప్రక్రియ అత్యంత సులభంగా, పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.
Slug: ap-voter-list-revision-sir-process-46-lakh-votes-verification-press-meet
