జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం రాజకీయంగా తన ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే డీఎస్సీ అవినీతి పేరుతో నానా యాగీ చేస్తూ రోడ్డెక్కుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తీరుపై నిప్పులు చెరిగారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా భర్తీలో ఎలాంటి అవకతవకలు గానీ, అవినీతి గానీ జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ ప్రతిపక్షం వద్ద ఏవైనా వాస్తవ ఆధారాలు ఉంటే కోర్టులను ఆశ్రయించవచ్చని సవాల్ విసిరారు. నిబంధనల ప్రకారం స్పోర్ట్స్ కోటాలో నేరుగా పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చే వెసులుబాటు చట్టంలో ఉందని, ప్రభుత్వం పూర్తిగా చట్టపరమైన నిబంధనల ప్రకారమే నియామక ప్రక్రియను చేపట్టిందని వివరించారు. శాప్ (SAAP) కార్యాలయం వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ దాడులకు తెగబడిన వారిపైనే పోలీసులు చట్టపరంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, విచారణ పూర్తయిన వెంటనే ఎంతటి పెద్దవారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు.
