జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే నినాదంతో యావత్ భారత యువతలో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని నింపి, నవచైతన్యాన్ని రగిల్చిన ధీరోదాత్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఘనంగా నివాళులర్పించింది. దేశ స్వేచ్ఛ కోసం, మాతృభూమి విముక్తి కోసం నవయవ్వనంలోనే ఉరికొయ్యను సైతం చిరునవ్వుతో ముద్దాడిన ఆ మహోన్నత త్యాగధనుని సేవలను పార్టీ శ్రేణులు స్మరించుకున్నాయి.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. భగత్ సింగ్ అసమాన త్యాగనిరతి, దేశభక్తి భావితరాలకు నిరంతరం ఆదర్శప్రాయమని కొనియాడారు. సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా, ప్రశ్నించే తత్వంతో పోరాడాలన్న ఆయన ఆశయాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలలో నిరంతరం ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. అమరవీరుడు భగత్ సింగ్ చూపిన త్యాగ మార్గంలో నడుస్తూ, ప్రజాహితమే ధ్యేయంగా పనిచేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
