ఆత్మీయ స్వాగతం పలికిన చిరంజీవి! (జన గళం స్పెషల్ డెస్క్)
హైదరాబాద్: భారతీయ సినీ రంగానికి గర్వకారణమైన పద్మవిభూషణ్, మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని ఆదోని మున్సిపల్ నూతన చైర్పర్సన్ శ్రీమతి స్వప్న నాయకర్ గారు, ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఎన్. మల్లికార్జున నాయకర్ (మల్లప్ప) గారు తమ కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లోని చిరంజీవి గారి నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, ఇటీవల ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన శ్రీమతి స్వప్న గారిని, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న మల్లప్ప నాయకర్ గారిని మెగాస్టార్ చిరంజీవి గారు శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అందజేశారు. ప్రజా నాయకులుగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆదోని పట్టణ సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని, నిరంతరం ప్రజాసేవలో ముందంజలో ఉండాలని చిరంజీవి గారు ఆకాంక్షించారు. మెగాస్టార్‌ను కలిసి ఆశీస్సులు అందుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని మల్లప్ప నాయకర్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
