జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కాకినాడ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం ఊపందుకుంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారతారనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్న నేపథ్యంలో, తాజా పరిణామాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో వరుపుల సుబ్బారావు జనసేన కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన, ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో కొంతకాలంగా నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయన జనసేన పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం బలపడింది.
అయితే వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరికపై ఆయన తరఫు నుంచి గానీ, అటు పార్టీ వర్గాల నుంచి గానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఈ పరిణామంపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్థానిక నేతలు భావిస్తున్నారు. ప్రత్తిపాడులో బలమైన వర్గం కలిగిన వరుపుల సుబ్బారావు జనసేన గూటికి చేరితే స్థానికంగా సరికొత్త రాజకీయ సమీకరణాలు ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది.
జనసేనలో కి వరుపుల సుబ్బారావు.. పిఠాపురంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరే అవకాశం ?
