జన గళం అంతర్జాతీయ డెస్క్: దివంగత యువరాణి డయానా జీవితంపై తన సోదరుడు ఎర్ల్ స్పెన్సర్ రాసిన పుస్తకం అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తోంది. డయానా జీవితానికి సంబంధించిన తన జ్ఞాపకాలను, ప్రత్యక్ష అనుభవాలను నమోదు చేయడం తన బాధ్యతగా భావించానని ఎర్ల్ స్పెన్సర్ తెలిపారు. చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా జరిగిన విషయాలను తన దృష్టికోణంలో నమోదు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆయన రాసిన స్వాన్ సాంగ్: డయానా, మై సిస్టర్ పుస్తకం సెప్టెంబర్ 22న విడుదల కానుంది.
డయానా 1997లో మరణించిన అనంతరం అప్పటి ప్రిన్స్ చార్లెస్‌తో జరిగినట్లు ఎర్ల్ స్పెన్సర్ పేర్కొన్న సంభాషణ ఈ పుస్తకంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. డయానా అంత్యక్రియల సందర్భంగా యువరాజులు విలియం, హ్యారీ తమ తల్లి శవపేటిక వెనుక నడవడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని స్పెన్సర్ తెలిపారు. ఆ సమయంలో చార్లెస్‌తో తనకు తీవ్ర వాగ్వాదం జరిగిందని, డయానాను త్వరలోనే మరిచిపోతామని అప్పటి ప్రిన్స్ చార్లెస్ అన్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఎర్ల్ స్పెన్సర్ తన జ్ఞాపకాల ఆధారంగా వెల్లడించారు.
ఈ ఆరోపణలపై బకింగ్‌హామ్ ప్యాలెస్ స్పందించింది. డయానాను కోల్పోయిన విషాదం, కుటుంబ సభ్యుల దుఃఖం అనేక సంవత్సరాల తర్వాత జ్ఞాపకాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్యాలెస్ పేర్కొంది. అయితే ఎర్ల్ స్పెన్సర్ మాత్రం తాను చెప్పిన విషయాలపై నమ్మకంతో ఉన్నానని, ఆ సంభాషణలో ఉపయోగించిన మాటలను తాను గుర్తుంచుకున్నానని ఇంటర్వ్యూలో తెలిపారు.
తన పుస్తకం కేవలం రాజకుటుంబంపై విమర్శలు చేయడానికే కాదని ఎర్ల్ స్పెన్సర్ పేర్కొన్నారు. డయానా తన సోదరి కావడంతో ఆమె జీవితానికి సంబంధించిన అనేక వ్యక్తిగత జ్ఞాపకాలు తన వద్ద ఉన్నాయని, వాటిలో తనకు తెలిసిన విషయాలను నమోదు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. డయానా మరణించి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్న సమయంలో ఆమె జీవితానికి సంబంధించిన అంశాలు మరోసారి అంతర్జాతీయంగా చర్చకు వస్తున్నాయి.
