జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించి, సంపూర్ణ రాజ్యాధికారం అందించడమే తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టపరంగా, న్యాయపరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు సంపూర్ణ న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.
ఈ సందర్భంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లపై కేవలం హడావుడి చేసి చేతులు దులుపుకున్నారని, హైకోర్టులో తీర్మానాలు వీగిపోయిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా ఆ విషయాన్ని గాలికొదిలేశారని ఎత్తిచూపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాల న్యాయపరమైన పోరాటాలను చిత్తశుద్ధితో కొనసాగిస్తోందని చెప్పారు. రిజర్వేషన్ల కల్పనను అడ్డుకునేలా అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఒకవేళ న్యాయ సమీక్షల్లోనూ రిజర్వేషన్లకు ఆశించిన అనుమతి లభించని పరిస్థితి తలెత్తితే, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పార్టీ పరంగా బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించి రాజకీయంగా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో ఎప్పుడూ ముందే ఉందని, బీసీ వర్గాలకు చెందిన ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, స్పీకర్లుగా ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుందని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ బడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా క ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల పేరుతో బీసీలపై కపట ప్రేమను ప్రదర్శించారని, కులాల వారీగా నామమాత్రపు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ద్వారా ఆశించిన స్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిజమైన రాజకీయ భాగస్వామ్యం కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఎన్నికలకు ముందు ‘వై నాట్ 175’ అంటూ ప్రగల్భాలు పలికిన వైఎస్సార్‌సీపీని ప్రజలు కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, రాష్ట్రాన్ని అథోగతి పాలుచేసిన ఆ పార్టీ నాయకులు మళ్లీ ప్రజల్లోకి వచ్చి ఏం చెప్పుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీ వర్గాలన్నీ వాస్తవాలను గమనించి, బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.
Slug: gollapudi-bc-reservations-vasantha-krishna-prasad-press-meet
