జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల సమరంలో అత్యంత అరుదైన, ఆసక్తికరమైన రాజకీయ పోరు తెరపైకి వచ్చింది. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య రాష్ట్రంలోనే మొట్టమొదటి “ఫ్రెండ్లీ కాంటెస్ట్” (స్నేహపూర్వక పోటీ) తిరువూరు మండల పరిధిలోని ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో ఖరారైంది. ఇక్కడ కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు రెండూ తమ అధికారిక బీ-ఫారాలను కేటాయించడంతో ఈ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
రిటర్నింగ్ అధికారి విడుదల చేసిన అధికారిక ఫారం-IX పోటీ అభ్యర్థుల జాబితా ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:
- తెలుగుదేశం పార్టీ (సైకిల్ గుర్తు): కొమ్మిరెడ్డిపల్లికి చెందిన దొడ్డా స్వప్న.
- జనసేన పార్టీ (గాజు గ్లాసు గుర్తు): కొమ్మిరెడ్డిపల్లికి చెందిన బంకా దివ్య.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ఫ్యాన్ గుర్తు): కొమ్మిరెడ్డిపల్లికి చెందిన బంకా మాణిక్యం.
ఈ ఎంపీటీసీ స్థానంలో జనసేన తరఫున ఉన్నత విద్యావంతురాలైన (బీటెక్) దళిత సోదరి పోటీలో నిలవగా, తెలుగుదేశం పార్టీ తరఫున మరో కీలక సామాజిక వర్గం నుంచి అభ్యర్థి బరిలో ఉండటంతో స్థానికంగా ఎన్నికల వాతావరణం రసవత్తరంగా మారింది. కూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ నడుస్తున్నప్పటికీ, ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ఇరు పార్టీల స్థానిక శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా ప్రచారం కొనసాగిస్తున్నాయి.
