గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
| By Tnooj Kishore12
అర్నబ్ తుపాను నష్టం, సహాయక చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఉప్పాడ తీరంపైనా అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉద్ధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు నష్టం వాటిల్లినట్టు వివరించారు. వీటిలో ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో దెబ్బతిన్నాయని, వీటికి తగిన నష్టపరిహారం వీలైనంత త్వరగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు.
అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రం మొత్తం తీర ప్రాంతం వెంబడి బోట్లు, వలలు తదితర వేట సామగ్రి నష్టపోయిన మత్స్యకారులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం అందజేసేలా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అర్నబ్ తుపాను కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేతలకు జరిగిన నష్టాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ముందు ఉంచారు. భారీ వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు వచ్చేయడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం కారణంగా వారి జీవనోపాధికి విఘాతం కలుగుతుందని తెలిపారు.
నష్టాన్ని అంచనా వేసి చేనేతలకు తుపాను పరిహారం అందించే ఏర్పాటు చేయాలని కోరారు.
విపత్తు నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ప్రశంసనీయంగా ఉందని మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించిన తీరును అభినందించారు.
పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను పకడ్బందీగా సమన్వయం చేశారన్నారు. అలాగే తుపాను సహాయక చర్యలను సమన్వయం చేసిన మంత్రివర్గ సహచరులను, సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు.