జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఎలక్ట్రిషియన్ల సర్వసభ్య సమావేశం స్థానిక కన్యకా పరమేశ్వరి సమాజ హాల్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో సంఘ న్యాయ సలహాదారుడు శ్రీ లంకిశెట్టి బాలాజీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మచిలీపట్నంలో పనిచేస్తున్న ఎలక్ట్రిషియన్లందరినీ కార్మిక శాఖ ద్వారా భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి, వారికి తక్షణమే అధికారిక గుర్తింపు కార్డులు (ఐడీ కార్డులు) మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వానికి మరియు కార్మిక శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ గారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మచిలీపట్నంలో బందరు పోర్ట్, గోవా షిప్ యార్డ్ వంటి భారీ ప్రాజెక్టులు వస్తున్నందున ఎలక్ట్రిషియన్లకు ఉపాధి అవకాశాలు, మంచి గుర్తింపు లభిస్తాయని తెలిపారు. ప్రతి ఎలక్ట్రిషియన్ తమ వృత్తిలో నూతన టెక్నాలజీని, మెలకువలను ఎప్పటికప్పుడు నేర్చుకుని కస్టమర్ల సంతృప్తిని పొందేలా నాణ్యమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అర్హులైన ఎలక్ట్రిషియన్లకు ప్రభుత్వం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే వృద్ధులైన ఎలక్ట్రిషియన్లకు పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. వృత్తిలో ఉన్నవారు ఎల్లప్పుడూ మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో జీవించాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ శ్రీ మామిడి మురళీకృష్ణ గారు ప్రత్యేక అతిథిగా పాల్గొని ఎలక్ట్రిషియన్ల సంక్షేమం కోసం కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రిషియన్ల పిల్లల చదువుల నిమిత్తం 50 శాతం ఫీజును తాను భరిస్తానని, అంతేకాకుండా ఉచితంగా నోట్ పుస్తకాలు అందజేస్తామని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. మచిలీపట్నంలో ఎలక్ట్రిషియన్లు ఎంతో అనుభవం, నైపుణ్యం కలిగి ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అపర్ వైర్స్ మేనేజర్ కిషోర్, మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిషియన్లు, వృత్తి నిపుణులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
Slug: machilipatnam-electricians-construction-workers-lankishetty-balaji
