జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు చందమామ బాబు నేతృత్వంలో శుక్రవారం మచిలీపట్నం రుస్తుంబాదలోని ప్రధాన పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్) కమిషనర్ శ్రీ వి. బాపిరాజు (బొడే బాపిరాజు) గారు ముఖ్య అతిథిగా విచ్చేసి బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ వీర వెంకట సత్య బాపిరాజు బోడే మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల చరిత్రను, వారి నిస్వార్థ సేవలను నేటితరం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల సేవలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, వారి త్యాగాలను నిత్యం స్మరించుకునేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో మహనీయుల చిత్రాలను గోడలపై చిత్రించే ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయం పరిసరాల్లోనూ స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. మహాత్మా గాంధీజీ చూపిన అహింస, సత్యం, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆచరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ పి.వి. ఫణికుమార్ గారు, కిషోర్, నారాయణ, వెలుగు ఫౌండేషన్ ప్రతినిధులు, నగరపాలక సంస్థ సిబ్బంది మరియు పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి మరియు విగ్రహానికి నివాళులర్పించారు.
Slug: machilipatnam-gandhi-jayanti-velugu-foundation-commissioner-bapiraju
