జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పరిధిలోని పొడగట్లపల్లి లక్ష్మీపాలెం అంగన్వాడీ కేంద్రంలో ‘మోడీ సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా అంగన్వాడీ ఉత్సవ్‌ను అత్యంత ఘనంగా నిర్వహించారు. సీడీపీవో గజలక్ష్మి గారి ఆదేశాల మేరకు, సూపర్‌వైజర్ జహంగీర్ సుల్తానా బేగం పర్యవేక్షణలో అంగన్వాడీ కార్యకర్త సంకు శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఈ వేడుకను వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, తల్లులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. బాలల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే బలమైన పునాది అని, సమాజానికి ఇవే తొలి విద్యా వేదికలని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ల నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు. చిన్నారుల్లో విద్య, ఆరోగ్యం, పోషకాహారం మరియు పరిశుభ్రతపై అవగాహన పెంపొందిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు.
చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించడంతో పాటు, గర్భిణులు మరియు బాలింతల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రామ పెద్దలు మరియు తల్లులు అంగన్వాడీ కార్యకర్తను, హెల్పర్ రేవతి నాగస్వాతిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే అంగన్వాడీ కార్యకర్త తల్లులను కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు మరియు తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Slug: ravulapalem-lakshmipalem-anganwadi-utsav-modi-seva-sankalp
