జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని మైలవరం శాసనసభ్యులు (ఎమ్మెల్యే) మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజాన్ని గడగడలాడించిన మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ అని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, న్యాయం అనే బాపూజీ ఆశయాలు నేటి ఆధునిక సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన అపారమైన త్యాగాలను, అందించిన నిస్వార్థ సేవలను ఈ పవిత్ర దినాన ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. హింసకు తావులేకుండా కేవలం శాంతియుత పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయమని తెలిపారు.
మహాత్మా గాంధీ చూపిన బాటలో నడుస్తూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఎమ్మెల్యే కోరారు. సత్యం మరియు అహింసా మార్గంలో ముందుకు సాగుతూ సమసమాజ నిర్మాణానికి, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. బాపూజీ ఆశయాలను నిజ జీవితంలో పాటించడమే ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైన నివాళి అని పేర్కొంటూ మైలవరం నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ శ్రేణులకు మరోసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Slug: mylavaram-gandhi-jayanti-mla-vasantha-venkat-krishna-prasad
