జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు వేగం పుంజుకున్న వేళ.. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా పోటీపై చర్చలు ఆసక్తికరంగా మారాయి.
కూటమి వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు కార్పొరేషన్లలో జనసేన పోటీ చేసే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. తిరుపతి కార్పొరేషన్‌ను బీజేపీకి కేటాయించే ప్రతిపాదనపై కూడా చర్చ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు కార్పొరేషన్లలో టీడీపీ పోటీ చేసే అంశం తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ పంపకాలకు సంబంధించి కూటమి అగ్రనాయకత్వం నుంచి తుది అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలోనే కూటమి నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయి బలాన్ని పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం 860 వార్డులకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
కార్పొరేషన్ల వారీగా సీట్ల కేటాయింపు తుది రూపం దాల్చితే.. ఆయా నగరాల్లో ఆశావహుల రాజకీయ కదలికలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో మేయర్ పదవి, డివిజన్ల కేటాయింపులు కూటమి రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయవాడలో ఇప్పటికే టీడీపీ, జనసేన వర్గాలు మేయర్ పదవిపై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
