జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: నెల్లూరు నగరంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎంఎస్ఎంఈ ఛైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ స్థానిక జనసైనికులు, క్రియాశీలక నాయకులు మరియు టికెట్ ఆశావహులతో ప్రత్యేకంగా ‘వన్ టు వన్’ ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయడమే ధ్యేయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన పార్టీ శ్రేణులకు సమగ్ర దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహుల నుంచి ఆయన పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడిన శివశంకర్, పార్టీ కోసం గతంలో అందించిన సేవలు, ఉద్యమాల్లో పాల్గొన్న తీరు, క్షేత్రస్థాయిలో వారికున్న ప్రజాదరణను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో పార్టీని వెన్నంటి నడిపించిన నిస్వార్థ నాయకులు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నవారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని, గెలుపు గుర్రాలకే అవకాశం దక్కుతుందని స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలో మారిన వార్డుల సరిహద్దులు, నూతన వార్డు నంబర్లు, ఓటర్ల జాబితాల్లో మార్పులు మరియు స్థానిక రాజకీయ సమీకరణాలపై ఆయన అభ్యర్థులకు స్పష్టతనిచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను చైతన్యపరచాలని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షా భేటీలతో నెల్లూరు నగర జనసేన కేడర్లో సరికొత్త రాజకీయ జోష్ నెలకొంది.
